Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

తిత్లీ స్కామ్ కల్లోలం! ఆ నలుగురిలో కలవరం!

తిత్లీ ఆ 4 నియోజకవర్గాలను కుదిపేయనుందా? నలుగురు తెలుగుదేశం పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తును సమూలంగా మార్చేయనుందా? ఎన్నికల్లో విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారిందా? స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కయిన వైసీపీ నేతలకు భంగపాటు తప్పదా.. ? మొత్తంగా రాష్ట్ర రాజకీయ యవనికపై పెను ప్రభావం చూపనుందా? అంటే అవుననే అంటున్నాయి తిత్లీ క్షేత్రస్థాయి గణాంకాలు. ఎప్పుడో అయిపోయిన తిత్లీ మళ్లీ ఇప్పుడేంటి అనుకుంటున్నారా.. మొన్న శ్రీకాకుళం ప్రజాజీవన వ్యవస్థను ఛిద్రం చేసిన తిత్లీ ఇప్పుడు రాజకీయ రూపురేఖల్ని మార్చేయనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు టిడిపి నేతల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. అదెలాగో దశలవారీగా ఇక్కడ చూద్దాం.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించిన సమయంలో ..సిఎం చంద్రబాబు, మంత్రివర్గ సహచరులతో పాటు మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగమంతా జిల్లాలో తిష్టవేసింది. సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించింది. ఇంతవరకూ బాగుంది..ఎక్కడ ధన ప్రమేయం ఉంటుందో అక్కడే రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది.

సిఎం చంద్రబాబు నష్టపరిహారం ప్రకటించారు. పొలిటికల్ బ్యానర్ల పొడవున్న చెక్కులూ ఇచ్చారు. తేడా వస్తే సహించేది లేదంటూ వార్నింగులూ ఇచ్చారు. కాని ఏమైంది.. అనుకున్నదానికంటె ఎక్కువే అయ్యింది. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. చిత్రవిచిత్రంగా నష్టపరిహార పంపిణీ అనేకానేక మలుపులు తిరిగి చివరికి అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఆ అంతులేని అవినీతి, అక్రమార్కుల విచిత్ర విన్యాసాలు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకు..

  1. ‘మీ భూమి’ రికార్డుల్లో సెంటు స్థలం ఉండదు..కాని లక్షల రూపాయలు విత్ డ్రా అయ్యాయి.
  2. ఎప్పుడో భూమి అమ్మేశారు. అయినా లక్షలు రూపాయలు కాజేశారు.
  3. పట్టుమని పదేళ్లు కూడా ఉండదు..గజం స్థలం యజమాని కాదు.. అయినా నష్టపరిహారం స్వాహా!
  4. అన్ని అర్హతలున్న..నిజమైన భూ యజమానులు వేలాదిమందికి చిల్లిగవ్వ కూడా దక్కలేదు
  5. ఎంత వెతికినా ఆ సర్వే నెంబర్ ఉండదు.. కాని లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయి.

ఏ నియోజకవర్గంలో, ఏమండలంలో, ఏ గ్రామంలో ఎన్ని లక్షలు పక్కదారి పట్టాయి? నియోజకవర్గాల వారీగా, జిల్లా వ్యాప్తంగా ఎన్నికోట్లు మింగేశారో గణాంకాలతో సహా అందిస్తున్నాము. ఏ స్థాయి అధికారి ఎంత వరకు బాధ్యుడో వివరాలు అందజేసే ప్రయత్నం చేస్తున్నాము..దయచేసి వేచి చూడండి.

ఉదాహరణకు ఈచిత్రాన్ని గమనించండి.. 11మండలాల జాబితా కూడా విడుదల చేస్తాము.

వేలాదిమంది నిజమైన హక్కు దారులకు రూపాయి కూడా తిత్లీ పరిహారం అందలేదు. రెవెన్యూ, కలెక్టర్, ఆర్టీజీఎస్, సిఎంఓ, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇలా సంప్రదించని శాఖ లేదు.. అర్జీ పెట్టని అధికారి లేడు. ఎవరికి వారు తప్పించుకుంటున్నారే తప్ప న్యాయం చేసే నాథుడే లేడు. ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం తప్పితే స్థానిక రైతుకి ఒరిగేదేమీ లేదు. అసలే తిత్లీ విధ్వంసానికి సర్వస్వం కోల్పోయి అనాథలా మారిన రైతుకి.. స్థానిక నేతలు, అధికారుల ప్రవర్తన ఆగ్రహం తెప్పిస్తోంది. ఎప్పుడు ప్రచారం ప్రారంభిస్తారా..కడిగేద్దామా అన్నంత కసితో ఉన్నారు. బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల్లో అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారన్నది వాస్తవం.

ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి తిత్లీ కుంభకోణంలో కొట్టుకుపోతారు?

తిత్లీ కుంభకోణంలో ఎవరి వాటా ఎంత?

ఏ నియోజవర్గంలో ఎన్ని కోట్లు దారి మళ్లాయి? అధికార, విపక్ష పార్టీలపై

తిత్లీ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో.. పూర్తిస్థాయి గణాంకాలు కూడా త్వరలో మీకోసం..

— > Subscribe to VIJETHA TV for Young News At Fingertips https://youtube.com/c/vijethatv

–> Related Photoes and Videos https://youtu.be/6PibKIdT1QI