సిబిఐ చేతికి ఆయేషా మీరా హత్య కేసు

61

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి..కేసు మొత్తం మొదటినుంచి విచారించాలని సిబిఐకి కోర్టు తెలిపింది.

2007 డిసెంబరులో విజయవాడలోని ప్రైవేటు హాస్టల్ లో బిఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. హాస్టల్ బాత్రూమ్ దగ్గర్లో ఆయేషా మృతదేహం పడి ఉంది. అప్పటినుంచి కేసు అనేక మలుపులు తిరిగాయి. అప్పటి మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి బంధువుని కాపాడడం కోసం ఫోరెన్సిక్ నివేదికతో పాటు అన్ని రిపోర్టుల్ని తారుమారు చేశారని ఆయేషా బంధువులు ఆరోపించారు.

ఆయేషా హత్యకేసులో అరెస్టైన సత్యంబాబును 2016 లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేసు పునర్విచారణ చేపట్టాలని ఏపీ పోలీసుల్ని ఆదేశించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. సిట్ దర్యాప్తు తీరుపై ఆయేషా మీరా తల్లి, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో ఆయేషా మీరా మర్డర్ కేసు దర్యాప్తు చేసిన సిట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆమె తల్లి హైకోర్టుకి ఫిర్యాదు చేయడంతో తాజాగా ఈ కేసు సిబిఐకి అప్పగించింది. మొదటినుంచి కేసు మొత్తం దర్యాప్తు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.