Categories
LITERATURE

బీసీల్లో కూడా తెలివైన పిల్లలుంటారన్న బాబు : కవి ప్రసాదమూర్తి సాహితీ విమర్శ

|| బీసీల్లో కూడా తెలివైన పిల్లలు ఉంటారట: బాబు ఉవాచ ||


ముఖ్యమంత్రి మహోదయా ఏమంటిరి ఏమంటిరి? బీసీ పిల్లల్లో కూడా తెలివైన వారుంటారని సెలవిచ్చితిరా? ఎంత మాట ఎంత మాట.ఇది అజ్ఞానమనుకుందుమా? లేక అహంభావమని నామకరణం చేయుదుమా? చెప్పండి ప్రభూ. గతములో కూడా తమరు ఇటులనే ఎవరూ ఒక ఎస్సీగా పుట్టాలని కోరుకోరు అంటూ వాక్రుచ్చితిరి కదా. ఇది ఏదో పొరపాటున నోరు జారితిరని సరిపెట్టుకొమ్మందురా? అటులనే అనుకొందుము కాని మీరు ఇటుల మాటిమాటికీ నోరు జారుట పరిపాటి కాదని మా విన్నపము. ఇదంతయూ ఏల? అసలు తెలివితేటలనిన ఏమిటో ఒకపరి వివరముగా తొక్కలు తీసి తేల్చుకొనుట మేలు కదా. అయినచో చిత్తగించుడీ మానవుడి పాదాలకు ప్రాణదానము చేసిన ఆ ఆదిమ కళాకారుడు.. చర్మకారుడు తెలివితక్కువవాడని మీ విశ్వాసమా? బహుశా ఆ చర్మకారుడు తన కండరాలను కదిలించి మస్తిష్కమును మథించి సృష్టించిన పాదరక్షలను రంగుటద్దాలలో ప్రదర్శించి విపణి వీధిలో కోట్లు గడించిన వాడే మహా మేధావి అని తమరు భావించితిరేమో. మానవుడి చర్మానికి రక్షాకవచముగా వస్త్రమును నేసిన ఆ ప్రాచీన కళాకారుడు.. చేనేత కార్మికుడు తెలివితక్కువ వాడని తమ అభిప్రాయమా? నిజమే ఆ నేతకార్మికుడి కండల కొండలలో ఉదయించిన వస్త్రారుణ ఆకాశాలను ప్లాస్టిక్ బొమ్మలకు చుట్టి చకచ్చకిత కాంతి మందిరాలలో పెట్టి అమ్ముకొని అశేష ధనరాశులను కొల్లగొట్టిన వాడే మీ దృష్టిలో తెలివైన వాడు కావొచ్చు.

కొండముచ్చు శిరస్సుల మీద బొచ్చు గొరిగి..చంకలలో కేశాల డొంకలను చదును చేసి మానవుడి ముఖానికి అందాన్ని అతికించిన క్షురక బ్రహ్మను కూడా తమరు తెలివి తక్కువ వారి జాబితాలో వేసి పరిహసించవచ్చు. అవును మరి మనిషిని జంతువు నుంచి వేరు చేసి లోకాన్ని శుభ్రం చేసిన వాడి పేరు మార్చి మణిమయ కాంతుల సెలూన్లు..బ్యూటీ పార్లర్లు పెట్టి కోట్లు కొట్టిన వాడే అసలు బ్రహ్మ అని మీ ఆలోచన కాబోలు. ఊరిని ఉతికి ఆరబెట్టి గంజిపెట్టి ఇస్త్రీ చేసి తళతళా మెరుపులద్ది ప్రపంచానికి పరిశుభ్రత నేర్పిన ఆ అనాది సృష్టికర్త..రజక శ్రామికుడు తెలివితక్కువ వాడనే తమ ఉవాచ కాబోలు. అందుకే ఆ యుగాల శ్రామికుని రక్తము నుంచి దోచుకొనిన కళను లాండ్రీలలో బంధించి వ్యాపారము చేయువాడే బుర్ర ఉన్న వాడని తస్మదీయ హృదయ సాగరము ఘోషించుచున్నది కావలయును. అగ్నిలో దేహాలను లోహాలుగా కరిగించిన కమ్మరి కూడా మీకు తెలివి తక్కువ వాడే. కావుననే కమ్మరి కొలిమిని కర్మాగారములకు తరలించిన వారిని తమరు మేధో సంపన్నులుగా గుర్తించుచుంటిరేమో. 

ఎంత పరిశోధన గావించి ఈ మహత్తర విషయమును ఆవిష్కరించితిరో కదా మీ తెలివితేటలను కీర్తించుటకు మా తెలివి తక్కువ నోటికి మాటలు తట్టుట లేదు మహాప్రభో. మట్టి కడలిని మథించి వెన్నెల పాత్రలను వెలికి తీసిన ఆ మట్టి మనిషి కుమ్మరి కూడా తెలివి తక్కువ వాడే. అరుణారుణ ఉదయాలను స్వర్ణభస్మముగా మార్చి మనోహర సువర్ణాభరణ చరణ చరణాల సౌందర్య గీతాల రచనలు చేసిన ఆ మహా విశ్వకర్మ కూడా తెలివితక్కువ వాడే. కాదు కాదు కొండొకచో మీ అభిమతమున కొందరు తెలివైన వారునూ పుట్టుదురు. వారిని ఆదుకొనుటకు తమబోంట్లను దేవుడు ఇలకు పంపించయుండవచ్చును.అందువలనే తమరు జాలర్లకు వలలను..రజక మిత్రులకు ఇస్త్రీ పెట్టెలను..నేతగాండ్రకు మరమగ్గములను..కమ్మరులకు కుమ్మరులకు సుత్తీ చెక్రాలను ఎందరెందరికో ఎన్నో అద్భుత పనిముట్లను కానుకగా ఇచ్చి ఆదుకొనుచున్నారు. ఎంతటి దయామయ కరుణామయ త్యాగమూర్తులు మీరు? ఒక మర్మము బోధపడకున్నది మహానుభావా. తెలివి తక్కువవారు కొన్ని కులములలో పుట్టుదురని ప్రవచించిన ప్రవక్తా! మరి ఆ తెలివి తక్కువ కులముల వారి కులవృత్తులు మీ అపార పరివార గణములకు వ్యాపార కేంద్రములుగా ఎటుల అక్కరకు వచ్చినవో చెప్పగలవా? 

జ్ఞానమనిన దొరతనము..దొంగతనమూ కాదని, అది శరీరమూ..మెదడూ..మనసూ కలిసి చరిత్రను చిలికిన సారమని బోధించే పిల్లలు పుట్టుకొస్తున్నారు రాజా. మీరు కానుకగా ఇచ్చే సైకిళ్ళ మీద కాదు, వాళ్ళు కాలం కత్తి మొన మీద నిలబడి కొత్త చదువులు చదువుతున్నారు. వారి ధగధ్ధగాయమాన జ్ఞాన కాంతి వలయాలలో చిక్కుకుని కుయ్యోమొర్రో అన్ననూ ఒక్కండును..ఒక్కండును మీ మొర ఆలకింపడు బాబూ 
——————————————————- —————————————————-
-ప్రసాదమూర్తి
28-01-2019